బ్లోమ్‌ఫాంటీన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో డీ/ఎల్ విధానంలో విజేతను నిర్ణయించారు. 400 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 33.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట ఆగిపోయింది.
డీ కాక్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. 96 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 138 పరుగులు చేశాడు. ప్లెసిస్(55) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆమ్లా(6), డివిలియర్స్(8), డుమిని(13), రొసౌ(19) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో అలీ 3 వికెట్లు పడగొట్టాడు. విలే, టాప్ లే చెరో వికెట్ తీశారు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. జాస్ బట్లర్ (76 బంతుల్లో 105; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించాడు. స్టోక్స్ (38 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హేల్స్ (57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రూట్ (52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా, రాయ్ (30 బంతుల్లో 48; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.
వన్డేల్లో తమ రెండో అత్యధిక స్కోరు చేసిన ఇంగ్లండ్, తమ జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు (15) నమోదు చేసింది. ఒక ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ కనీసం ఒక సిక్సర్ అయినా కొట్టడం వన్డేల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. డీ కాక్ కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కడం విశేషం. ఈ విజయంతో 5 వన్డేల సిరీస్ లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Post a Comment