సిడ్నీ: ఇటీవల ఆస్ట్టేలియాతో జరిగిన చివరి టీ 20 లో ఆఖరి ఓవర్ లో ఫోర్, సిక్సర్ తో రాణించి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ .. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నమ్మకాన్ని గెలుచుకున్నాడు. త్వరలో భారత్ లో ఆరంభం కానున్న వరల్డ్ టీ 20 టోర్నీ నాటికి యువీ మరికొన్ని మ్యాచ్ లు ఆడితే తనదైన ఫామ్ ను తప్పకుండా అందిపుచ్చుకుంటాడని ధోని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాకపోతే రైనా-యువీల బ్యాటింగ్ ఆర్డర్ లో స్వల్ప మార్పులు అవసరమని పేర్కొన్నాడు. ఇద్దరు ఎడమ చేతి వాటం ఆటగాళ్లు కావడంతో ఒకరు మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చినా.. మరొకరు ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వస్తే టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంటుందన్నాడు. గతంలో ఐపీఎల్ మొదలుకొని, ఒక టీ20 వరల్డ్ కప్ లో సురేష్ రైనా మూడో స్థానంలో వచ్చి రాణించిన విషయాన్ని ఈ సందర్భంగా ధోని గుర్తు చేశాడు. రైనాను మూడో స్థానంలో ఆడిస్తే, యువీని కచ్చితంగా ఐదో స్థానంలో దింపడమే సరైన విధానమన్నాడు. ఇలా చేస్తే ఆ ఇద్దరి ఆటగాళ్ల స్థానాలను సరైన విధానంలో భర్తీ చేసినట్లు అవుతుందన్నాడు. ఐదో స్థానంలో ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుందని ధోని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
వరల్డ్ కప్‌కు ముందు సన్నాహకంగా భారత్‌కు అందుబాటులో ఉన్న కనీస టి20 మ్యాచ్‌ల సంఖ్య పది. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆ తర్వాత ఆసియా కప్‌లో కనీసం ఐదు మ్యాచ్‌లు ఉన్నాయి. ఫైనల్‌కు చేరితే మరో మ్యాచ్ కూడా దక్కుతుంది. ఇప్పటికే శ్రీలంకతో సిరీస్ కు యువరాజ్ సింగ్ చోటు లభించడంతో ఇక రాణించడమే అతని ముందున్న లక్ష్యం. ఈ సిరీస్ లో యువీ తనదైన ముద్ర వేస్తే మాత్రం కచ్చితంగా వరల్డ్ టీ 20 లో చోటు దక్కుతుంది.
Post a Comment