దేశంలో 7%.. ఏపీలో 14-15% వృద్ధిరేటు
రాష్ట్ర ఆర్థిక స్వావలంబనకు కష్టపడాలి.. అభివృద్ధికి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
అధికారులకు చంద్రబాబు పిలుపు.. రికార్డుస్థాయిలో సిమెంటు రోడ్ల నిర్మాణం
పంట సంజీవనికి ప్రచారం కల్పించాలి.. ఈపోస్ విఫలానికి కుట్రలు సాగనివ్వం
ప్రతి పల్లె మోడల్ విలేజ్ కావాలి: సీఎం.. మంత్రులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
విజయవాడ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర సుస్థిర ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులో దేశ వృద్ధి రేటు 7 శాతం ఉంటే ఏపీ మాత్రం 14 నుంచి 15 శాతం నమోదు చేస్తోందని పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి మంత్రులు, కలెక్టర్లు, జన్మభూమి కమిటీ సభ్యులతో ఆయన మూడు గంటలపాటు వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని, లక్ష్యాలను సాధించినప్పుడు విజయోత్సవాలు చేసుకోవాలని సూచించారు. తద్వారా ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం లభించడంతోపాటు మరిన్ని లక్ష్యాల సాధనకు ప్రోత్సాహం లభిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. హుద్‌హుద్ తుఫానుతో దెబ్బతిన్న విశాఖ ఏడాదిన్నరకే కోలుకుని ఫ్లీట్ రివ్యూ లాంటి అంతర్జాతీయ వేడుకలకు ఆతిథ్యమిచ్చిందని, విశాఖ కోలుకోవడానికి అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధి, దీక్ష కారణమని ప్రశంసించారు.
నవ్యాంధ్ర అభివృద్ధిలోనూ అదే స్ఫూర్తిని ప్రదర్శించాలని సీఎం పిలుపునిచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో రాషా్ట్రన్ని కేంద్రం ప్రశంసించిందని చంద్రబాబు తెలిపారు. మన దేశంలో బ్రిటన్ నెలకొల్పబోయే 11 ఆస్పత్రులకు అమరావతి కేంద్రం కాబోతోందన్నారు. సిమెంటు రోడ్ల నిర్మాణంలో రాష్ట్రం చరిత్ర సృష్టించబోతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 4,699 కిలోమీటర్ల సిమెంటు రహదారులను నిర్మించాలన్న లక్ష్యానికిగాను ఇప్పటికే 4,527 కిలోమీటర్లకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, 1490 కిలోమీటర్లకు పనులు పూర్తి చేశామన్నారు. ప్రతి పల్లెను మోడల్ విలేజ్‌గా మార్చుకునేందుకు జన్మభూమి కమిటీలు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా చేపట్టిన పంట సంజీవని పథకంలో భాగంగా చేపట్టిన పంటకుంటలకు విస్తృత ప్రాచుర్యం కల్పించాలని సీఎం సూచించారు. 50వేల పంట కుంటలు పూర్తయితే వేడుక జరుపుకోవాలని, లక్ష పంటకుంటలు పూర్తయితే మరింత పెద్ద వేడుక జరుపుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల పంటకుంటలను తవ్వడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి సుమారు 17 లక్షల వినతులు వచ్చాయని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
వినూత్నంగా ఆలోచించండి
కలెక్టర్లు మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించాలని సీఎం చంద్రబాబు కోరారు. వేగవంతమైన అభివృద్ధికి అవసరమైన ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలన్నారు. దీర్ఘకాలిక అభివృద్ధి.. సుస్థిరమైన ప్రగతి సాధించేందుకు అనువైన పథకాలకు రూపకల్పన చేయాలన్నారు. విజయవాడ నుంచి గన్నవరం వరకూ చేపట్టిన ప్రధాన రహదారి అభివృద్ధికి సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయని, భవిష్యతలో చేపట్టనున్న సుందరీకరణ ప్రాజెక్టులకు ఇది నమూనాగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఉపాధి పథకం అమలులో ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలు వెనకబడి ఉన్నాయని, ఆ జిల్లాలు కూడా లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆదేశించారు. విశాఖపట్నంలో ఐఎ్‌ఫఆర్ ఎగ్జిబిషనలో ఏర్పాటు చేసిన టాయిలెట్లు ఎంతో బాగున్నాయని సీఎం పేర్కొన్నారు. ఒక్కో టాయిలెట్ ఏర్పాటుకు కేవలం రూ.17,500 ఖర్చయిందని, వాటిని రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు.
పశ్చిమలో ఆందోళనకరంగా భూగర్భజలాలు
పశ్చిమగోదావరి జిల్లాలో 17 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవటం ఆందోళన కలిగిస్తోందని, అనంతపురం, చిత్తూరు కంటే భూగర్భ జలమట్టాలు పశ్చిమలో దారుణంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు కారణాలను సమీక్షించి, జలమట్టాలు పెంచేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో కృష్ణా, పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాలు నెంబర్ వనగా నిలిచాయన్నారు. ఈ పోస్‌ను విఫలం చేయటానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వబోమని సీఎం స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ప్రభుత్వశాఖ సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. జన్మభూమి కమిటీ సభ్యులు పింఛన్‌దారులను వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, వారిలో భరోసా నింపాలన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణం అత్యంత ప్రాధాన్యం కలిగిన విషయమని, దీనిపై కలెక్టర్లందరూ సీరియ్‌సగా పనిచేయాలని కోరారు.
Post a Comment