బలమైన’ స్థానిక నేతల కోసం వెతుకులాట
♦ సామాజిక, ఆర్థిక బలాలపై లెక్కలు
♦ 50 డివిజన్లలో బలవంతుల కోసం‘ కార్డన్ సెర్చ్’
బహుబలి.. కండలు తిరిగిన వీరుడు.
ఆ సినిమా ఓ సంచలనం. ఆ పాత్ర పెద్ద హిట్...
♦ సామాజిక, ఆర్థిక బలాలపై లెక్కలు
♦ 50 డివిజన్లలో బలవంతుల కోసం‘ కార్డన్ సెర్చ్’
బహుబలి.. కండలు తిరిగిన వీరుడు.
ఆ సినిమా ఓ సంచలనం. ఆ పాత్ర పెద్ద హిట్...
ఇక్కడ సీన్ మారింది. మన నేతలు ఎన్నికల్లో అన్ని విధాలా నెగ్గుకొచ్చే బహుబలుల కోసం వెదుకుతున్నారు. బరిలో దింపే ప్రయత్నం చేస్తున్నారు. ‘కండ..అండ..ఆర్థిక..సామాజిక.. ఇలా బహుబలాలు ఉన్నవాడే ‘కార్పొరేటర్’కు క్వాలిఫైడ్. అతనే మన పార్టీకి గెలుపుసాధించే ‘బహుబలి’. వెదకండి...పార్టీ నుంచి టికెట్ ఇద్దాం. గెలుపునకు బాటలు వేద్దాం’ అంటూ ప్రధాన రాజకీయ పక్షాలు బలమైన అభ్యర్థులను వెదుకుతున్నాయి. ‘బహుబలి’ని వెదికి పట్టండంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. కనీసం 50 డివిజన్లలో అలాంటి వారినే నిలపాలని భావిస్తున్నాయి. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున వ్యక్తుల విషయంలోనూ పట్టింపులు వద్దంటున్నాయి. ‘కేసులు, గీసులు తర్వాత చూద్దాం..గెలిచే వారినే ఎంపిక చేద్దాం’ అంటూ ప్రధాన రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ పోస్ట్‌కు తప్పనిసరిగా గెలిచే అభ్యర్థులనే నిలపాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసం ఎంతవరకైనా వెళ్లాలని చూస్తున్నాయి. ‘కండ బలం ఉన్న నాయకులు కావాలి. వీరికి స్థానికంగా సామాజిక, ఆర్థిక బలాలుంటే మరీ మంచిది.. చదువు, నేర చరిత్రలను కాసేపు పక్కన పెట్టేయ్..మనం గెలవటమే ఏకైక లక్ష్యం..అందుకే రాజకీయ శత్రువుని ఎలాగైనా ఓడించే బహుబలిని వెంటనే వెతకండి’ అంటూ ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తమ శ్రేణులకు దిశానిర్దేశనం చేస్తున్నాయి. గ్రేటర్లో మొత్తం 150 డివిజన్లకు గానూ రిజర్వేషన్ల మూలంగా సుమారు 50 స్థానాల్లో తమ అంచనాలకు తూగే అభ్యర్థులు సొంత పార్టీలో కనిపించటం లేదు. దీంతో నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలందరికీ పార్టీ ముఖ్యనేతలు గెలిచే అభ్యర్థిని ఎంపిక చేసి, గెలిపించుకు రావాలన్న ఆదేశాలు జారీ చేస్తున్నారు. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను కూడా ఈ మారు బరిలోకి దింపే కసరత్తును ప్రధాన పార్టీలు చేస్తున్నాయి. మరో వైపు జంట పోలీస్ కమిషనరేట్లలో ఉన్న సుమారు 1500 మంది రౌడీషీటర్ల సేవలను సైతం వినియోగించుకునేందుకు ఆయా పార్టీలు పక్కా స్కెచ్‌లు వేస్తున్నట్లు తెలుస్తోంది.
బలాలపై బేరీజు
కండ పుష్టి, సంబంధిత డివిజన్లో వారి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఏ మేరకు ఉన్నాయి, అభ్యర్థి సొంతంగా ఏ మేరకు ఖర్చు చేయగలడన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కార్పొరేటర్ అభ్యర్థిగా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సుమారు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలు వ్యయం చేయాల్సి ఉంటుం దని, ఆ మేరకు సంబంధిత అభ్యర్థి ఆదాయ వ్యయాలను అంచనా వేస్తున్నారు. పాతబస్తీలో ముప్పైకి పైగా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న ముగ్గురు కార్పొరేటర్లకు తాజా రిజర్వేషన్ సైతం అనుకూలంగా రావటంతో ఈ మారు పోటీకి సిద్ధమవుతున్నారు.
సచ్చీలురనే ఎంపిక చేయండి: ఎలక్షన్ వాచ్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయా పార్టీలు సచ్చీలురైన అభ్యర్థులనే పోటీలో నిలపాలని ‘ఎలక్షన్ వాచ్’ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థలు అన్ని రాజకీయపక్షాలకు లేఖలు రాశాయి. గడిచిన ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అత్యధిక కేసులున్న వారికి టికెట్లు ఇవ్వగా తర్వాత స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, ఎంబీటీ పార్టీలున్నాయి. ఈ మారు మాత్రం నేర చరిత్ర లేని అభ్యర్థులతో పాటు స్థానికంగా నివాసం ఉండటం, విద్యార్హత, యాభై ఏళ్ల లోపు వయసు ఉన్న వారికే టికెట్లు ఇవ్వటం వల్ల స్థానిక పాలనలో ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని ఆయా సంస్థలు పేర్కొన్నాయి. కానీ ఈ లేఖలను ఎన్ని పార్టీలు పరిగణనలోకి తీసుకుంటాయనేది సందేహమే.
నేరచరితులకు టికెట్లిస్తే... ఆఫీస్‌ల ముందు బైటాయిస్తాం
అసెంబ్లీ, లోక్‌సభలకు వెళ్లే దిశగా తొలి మెట్టు స్థానిక సంస్థలు. స్థానిక సంస్థల్లో నేర చరితులకు టికెట్లు ఇవ్వకుండా చేయగలిగితే చట్ట సభల్లోనూ వారి ప్రాతినిధ్యం తగ్గుతుంది. అందుకే అన్ని పార్టీలు నేరస్తులకు టికెట్లు ఇవ్వొద్దు. పౌర సమాజం అభ్యర్థనకు భిన్నంగా వ్యవహరించే పార్టీల కార్యాలయాల ముందు మేం బైటాయించి నిరసన వ్యక్తం చేస్తాం. మంచి వ్యక్తులను పాలకులను చేసేందుకు ప్రజలూ చొరవ చూపాలి.
- పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
2009లో గెలిచిన కార్పొరేటర్లలో కేసులున్న వారు
పార్టీ కార్పొరేటర్ల సంఖ్య
ఎంఐఎం 16
టీడీపీ 09
కాంగ్రెస్ 08
బీజేపీ 02
ఎంబీటీ 01
Post a Comment