‘ఔట్‌లుక్’ కథనంపై హైకోర్టు అసంతృప్తి
♦ సెక్సియస్ట్ వ్యాఖ్యలు హర్షణీయం కాదు
♦ ఆ కథనం హుందాగా లేదు
♦ ప్రతివాదులకు నోటీసులు జారీ
♦ విచారణ వాయిదా
ఐఏఎస్ అధికారి, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఔట్‌లుక్ వారపత్రిక ప్రచురించిన కథనంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ కథనంలో ఆమెపై చేసిన ‘సెక్సియస్ట్’ వ్యాఖ్యలు ఏమాత్రం హర్షణీయం కాదని పేర్కొంది. మహిళల హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని, అందువల్ల వారిని అన్ని వేళలా గౌరవించి తీరాలని వ్యాఖ్యానించింది. తాము ప్రచురించిన కథనంపై క్షమాపణలు సైతం తెలిపామన్న ఔట్‌లుక్ తరఫు సీనియర్ న్యాయవాది అనూప్ భంభానీ చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ‘‘చేయాల్సిన నష్టమంతా చేసి క్షమాపణలు చెబితే సరిపోతుందా..?’’ అని హైకోర్టు తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది.
ఈ కేసులో న్యాయపోరాటం చేసేందుకు స్మితా సబర్వాల్‌కు నిధులు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవో విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది. జీవోను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేశాక వ్యాజ్యాలపై విచారణ చేపడతామంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సారీ చెబితే కేసు వేయకూడదా...
ఈ వ్యాజ్యాలపై తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి అంతకుముందు వాదనలు వినిపిస్తూ న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం స్మితా సబర్వాల్‌కు రూ. 15 లక్షలను విడుదల చేశామని, అంతేకాక ఔట్‌లుక్‌పై ఆమె న్యాయస్థానంలో కేసు కూడా దాఖలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి అనూప్ భంభానీ స్పందిస్తూ విధి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వోద్యోగులు కేసు దాఖలు చేయడానికి వీల్లేదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ కార్టూన్ వేసి, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది.
తాము క్షమాపణలు చెప్పామని, తమ కథనం వల్ల నష్టం జరిగిందని భావిస్తే దానిపై పోరాటానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, అంతేతప్ప ప్రజల నిధులను వ్యక్తిగత అవసరాల కోసం కేటాయించడం సరికాదని భంభానీ వాదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘‘మీరు ప్రచురించిన కథనాన్ని ఒక్కసారి చదవండి. అది ఎంత అభ్యంతరకరంగా ఉందో మీకూ తెలుస్తుంది. మహిళల హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మీరు రాస్తారు.. నష్టం చేస్తారు.. తరువాత సారీ అంటారు. మీరు చెప్పే సారీ ఎంత మంది చదివి ఉంటారు? కథనంపై చేసిన సెక్సియస్ట్ వ్యాఖ్యలపై మేం ఎంత మాత్రం సంతృప్తికరంగా లేం.
ఫ్యాషన్ షో గురించి రాశారు. ముఖ్యమంత్రి, మంత్రులపై వ్యాఖ్యలు చేశారు. మీరు సారీ చెప్పినంత మాత్రాన ఆమె (స్మితా) సివిల్ సూట్ దాఖలు చేయకూడదా? ప్రభుత్వం తన నిధులను వివిధ రకాల పనులకు మళ్లిస్తుంది. మరి అలా మళ్లించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేయలేదేం? కల్తీ కల్లు, మద్యం తాగి మృతి చెందిన వారికి ప్రభుత్వం పరిహారమిస్తోంది. వారికి ప్రభుత్వం ఎందుకు పరిహారం ఇవ్వాలి. వారు చనిపోయింది ప్రభుత్వం వల్ల కాదు కదా? దేనికి నిధులివ్వాలో ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యంలో ప్రస్తుతం తాము ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది.
Post a Comment