-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 26, 2016

‘కౌంట్‌డౌన్’ మొదలు....!


♦ పపంచకప్‌కు  భారత్ సన్నాహాలు
♦ ఆస్ట్రేలియా సిరీస్‌తో ప్రారంభం
♦ నేడు తొలి టి20 మ్యాచ్
♦ జట్టు కూర్పుకు పరీక్ష

 ధనాధన్ సందడి మొదలైంది. టి20 ప్రపంచకప్ చేరువలో ఉండటంతో అన్ని జట్లూ ఇప్పుడు పొట్టి ఫార్మాట్ మూడ్‌లోకి వెళుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి కాస్త ఎక్కువగా భారత జట్టు కూడా వరల్డ్‌కప్‌కు ముందు పొట్టి ఫార్మాట్‌లో  మ్యాచ్‌లు ఆడుతూ సన్నాహాలపై దృష్టి పెట్టింది. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత శ్రీలంకతో 3 మ్యాచ్‌లు, ఆపై ఆసియా కప్ టోర్నీ, అనంతరం సొంతగడ్డపై ప్రపంచకప్.... ఇలా టీమిండియా వరుసగా ట్వంటీ-20 మ్యాచ్‌లే ఆడబోతోంది. ఈ క్రమంలో మంగళవారం తొలి టి20లో ఆసీస్‌తో సమరానికి సిద్ధమైంది. విశ్వ వేదిక, పరిస్థితులు భిన్నం అయినా... బలాబలాలను, తుది జట్టు కూర్పును పరిశీలించుకునేందుకు ఈ సిరీస్ మంచి అవకాశం ఇస్తోంది.

 అడిలైడ్: గత ఏడాది మొత్తంలో భారత్ ఐదు టి20 మ్యాచ్‌లు ఆడితే, ఆస్ట్రేలియా ఒకే ఒక టి20 ఆడింది. అయితే ప్రపంచకప్ చేరువలో ఉండటంతో ప్రస్తుతం ఇరు జట్లూ ఈ ఫార్మాట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాయి. వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా కంగారూలపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుండగా, సొంతగడ్డపై తమ జోరును కొనసాగించాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ నేడు (మంగళవారం) జరగనుంది. వన్డేల నుంచి భారత జట్టు కెప్టెన్సీలో మార్పు లేకపోగా, టి20ల్లో ఆస్ట్రేలియాకు ఫించ్ సారథ్యం వహిస్తున్నాడు.

 పాండ్యా, బుమ్రాలకు అవకాశం!
 వన్డే సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లలో భారత్ తరఫున నలుగురు కొత్త ఆటగాళ్లు అరంగేట్రం చేయడం విశేషం. టి20ల్లో కూడా యువ ఆటగాళ్లను ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. జట్టులోకి ఎంపికైన తర్వాత హార్దిక్ పాండ్యా దేశవాళీలో మరింత చెలరేగిపోయాడు. ముస్తాక్ అలీ టోర్నీలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతను తుది జట్టులోకి రావచ్చు. అదే విధంగా చివరి వన్డేలో కెప్టెన్ ధోని ప్రశంసలు అందుకున్న జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఎంపిక కావచ్చు.
వన్డే జట్టులో చోటు కోల్పోయిన సురేశ్ రైనా తన సత్తా చాటేందుకు ఇది తగిన వేదిక. ఇక మళ్లీ జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. అతనితో పాటు వెటరన్ నెహ్రా ప్రధాన పేసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు.  ప్రధాన బ్యాట్స్‌మెన్ రోహిత్, శిఖర్, కోహ్లి ఫామ్‌లో ఉం డటం భారత్‌కు అనుకూలాంశం. ఇక ధోని కూడా ఒక మెరుపు ఇన్నింగ్స్ కోసం సిద్ధమయ్యాడు.  

 టెయిట్ పునరాగమనం...
 తుది జట్టు ఎంపికలో ఆస్ట్రేలియా పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. అనూహ్యంగా సెలక్టర్లు ఏకంగా 17 మందితో జట్టును ఎంపిక చేశారు. కాబట్టి కొత్త ఆటగాళ్ల మధ్య  గట్టి పోటీ ఏర్పడింది. గాయపడిన మ్యాక్స్‌వెల్ స్థానంలో బిగ్‌బాష్ లీగ్ టాప్ స్కోరర్ క్రిస్ లిన్ రావడం ఖాయమైంది. వన్డేల్లో లేని షేన్ వాట్సన్ కూడా బరిలోకి దిగుతాడు.
కెప్టెన్ ఫించ్ ఫామ్‌లో ఉండగా, ఆల్‌రౌండర్ ఫాల్క్‌నర్ జట్టుకు బలం. ఎప్పుడో ఐదేళ్ల క్రితం రిటైరైన పేసర్ షాన్ టెయిట్ ఆశ్చర్యకరంగా ఇప్పుడు మళ్లీ ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చాడు. ప్రధాన పేసర్‌గా అతను ఏమాత్రం రాణిస్తాడో చూడాలి. మరోవైపు కివీస్‌తో సిరీస్ సన్నాహాల కోసం ముందే బయల్దేరనున్న డేవిడ్ వార్నర్, స్మిత్ చివరి టి20 ఆడటం లేదు. దాంతో మొదటి రెండు మ్యాచ్‌లలోనే చెలరేగి సిరీస్ అందించాలని పట్టుదలగా ఉన్నారు. వీరిద్దరు తమ స్థాయిలో ఆడితే భారత్‌కు కష్టాలు తప్పవు.

 తుది జట్ల వివరాలు (అంచనా)
 భారత్: ధోని (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్, కోహ్లి, రైనా, యువరాజ్, హార్దిక్ పాండ్యా, జడేజా, బుమ్రా, నెహ్రా, అశ్విన్/హర్భజన్.
 ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, స్మిత్, క్రిస్ లిన్, వాట్సన్, ఫాల్క్‌నర్, వేడ్, హేస్టింగ్స్, లయోన్, బాయ్‌స్, టెయిట్.

 పిచ్, వాతావరణం
 బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్. బిగ్‌బాష్ లీగ్‌లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో కూడా అలాంటి అవకాశాలే ఉన్నాయి. సాధారణ వాతావరణం, వర్ష సూచన లేదు.

 ‘పండగ’ ఎవరికి?
 మంగళవారం భారతదేశం యావత్తూ రిపబ్లిక్ డే జరుపుకోనుంది. 26 జనవరి ఆస్ట్రేలియా నేషనల్ డే కూడా కావడం విశేషం. ఒకే రోజు ఇరు జట్లు జాతీయ దినోత్సవం నిర్వహించుకుంటున్న వేళ విజయం ఎవరికి సంతోషం పంచుతుందో మరి!

 మధ్యాహ్నం గం. 2.00 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-1లో  ప్రత్యక్ష ప్రసారం

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu