శ్రీకాళహస్తి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జడ్జి ముందు పోలీసులు హాజరు పరిచారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పతంనం ఆరంభమైందన్నారు. అందుకే ఆయన ఇటువంటి దుర్మార్గపు చర్యలకు దిగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కాల్ మాఫియా, ఇసుక మాఫియా అంటూ రాష్ట్రాన్ని మాఫియా రాష్ట్రంగా మార్చారని ఎమ్మెల్యే చెవిరెడ్డి మండిపడ్డారు. ప్రజా ప్రతినిధిని ఈ విధంగా అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు. వేరే రాష్ట్రానికి వెళ్లినప్పుడు కాపుకాసి వెంటాడినట్లుగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా.. సమాచారమిస్తే ఎంపీ నేరుగా వచ్చి హాజరు అవుతాడని అంతేగానీ ఇలా దుర్మార్గపు రీతిలో ప్రజా ప్రతినిధిని అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
'ఎమ్మార్వో వనజాక్షిని కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిని చంకలో పెట్టకుని రక్షించావు. కాల్ మనీలో మహిళల్ని వేధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలను కాపాడుతూనే వచ్చావు. ఇప్పుడు రాక్షసంగా వైఎస్ఆర్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై ఈ విధంగా చర్యలకు పాల్పడుతున్నారు' అని చెప్పుకొచ్చారు. రాజీ అయినట్లు కనిపించిన కేసును పెద్దది చేసి మరీ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించడం, ఏకంగా 250కు పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరి ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ సీపీ నేతలపై ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని చెవిరెడ్డి ఆరోపించారు. బాధ్యత గల వ్యక్తి, ప్రజా ప్రతినిధి ఎంపీ మిథున్ రెడ్డిని ఈ విధంగా వెంటాడినట్లుగా అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. వైఎస్ఆర్ సపీ నేతలు, కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురిచేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి పేర్కొన్నారు.
Post a Comment