అతని పేరు మీడియాలో రాయకండి
పిటిషనర్‌కు అక్షింతలు
విజయకాంత్‌కు ఊరట
సాక్షి, చెన్నై: కొన్ని పబ్లిసిటీ పిటిషన్లకు ప్రాధాన్యం ఇవ్వవద్దు అని మీడియాకు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం సూచించింది. ఓ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అతడి పేరు కూడా రాయ వద్దని పేర్కొంది. పిటిషనర్‌కు అక్షింతలు వేసిన బెంచ్, డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఊరట ఇస్తూ బెయిల్‌ను పొడిగించింది. ఇటీవల కాలంగా కోర్టుల్లో చిన్న చిన్న సమస్యలతోనూ పిటిషన్లు దాఖలు అవుతోండటం న్యాయమూర్తుల్లో తీవ్ర అసహనాన్ని రేకెత్తిస్తోంది. ఇటీవల మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ న్యాయవాదుల మీద తీవ్ర ఆగ్రహాన్ని సైతం వ్యక్తం చేశారు. చిన్న సమస్యలు, పబ్లిసిటీ పిటిషన్లను కోర్టుల్లో దాఖలు చేయవద్దని, అవసరం అయితే, స్థానిక ప్రజా ప్రతినిధుల్ని కలవాలని హితవు పలికారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎండీకే అధినేత విజయకాంత్‌పై ఏడాది పాటుగా నాన్ బెయిల్ వారెంట్‌తో గూండా చట్టం కింద కేసు నమోదుకు ఆదేశించాలని ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ మదురై ధర్మాసనానికి ఆగ్రహాన్ని తెప్పించింది. డీఎండీకే అధినేత విజయకాంత్ వ్యాఖ్యలు, చేష్టలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నాయని, ఆయన కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే ప్రమాదం ఉందని, ఇప్పటికే పలు కేసుల్ని ఎదుర్కొంటున్న విజయకాంత్ మీద గూండా చట్టం నమోదు చేయాలంటూ అన్నాడీఎంకేకు చెందిన న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
మదురై ధర్మాసనం న్యాయమూర్తులు రామసుబ్రమణియన్, కృపాకరణ్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఇది పబ్లిసిటీ కోసం దాఖలు చేసినట్టుందని వ్యాఖ్యానించారు. తమ పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా స్పష్టం అవుతోందని చురకలు అంటించారు. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయవద్దు అని, ఇలాంటి వారికి పబ్లిసిటీ ఇవ్వొదని మీడియాకు సూచించారు. పిటిషనర్‌కు అక్షింతలు వేశారు. పబ్లిసిటీ కోసం ప్రయత్నించిన ఈ పిటిషనర్ పేరును దయచేసి రాయొద్దని సూచించారు. ఆ పిటిషన్ విచారణను తిరస్కరిస్తూ పిటిషనర్‌కు అక్షింతలు వేశారు. తదుపరి విజయకాంత్ బెయిల్ పొడిగింపు పిటిషన్‌ను పరిశీలించి, అందుకు తగ్గ ఆదేశాలు ఇచ్చారు.
Post a Comment