అతనో 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్..అతను తనకు ఏ చిన్న అనారోగ్యం వచ్చిన గూగుల్ తల్లిని ఆశ్రయిస్తాడు.. అంటే అది కూడా అలా ఇలా కాదండోయ్.. తనకు కలిగిన లక్షణాలను బట్టి ఏ రోగం వచ్చిందో కనుక్కోవడానికి గంటలు గంటలు నెట్టింట్లో గడిపేస్తాడు..ఇలా చాలా సేపు గడిపిన తర్వాత తనకు చాలా రోగాలు ఉన్నాయని తుది నిర్ణయానికి వచ్చేసి చివరికి నిరాశ, నిస్పృహలకు లోనవుతుంటాడు. కాని చివరికి తేలిదేంటంటే అతనికి ఉంది మలబద్ధకం.. ఇలా రోజులకు రోజులు గూగుల్‌ను అతిగా ఉపయోగించి చివరికి సైబర్‌కాండ్రియా అనే మానసిక రోగిగా మారిపోయాడు. ప్రస్తుతం ఆ గూగుల్ ప్రియుడు ముంబైలోని జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
‘ఆ వ్యక్తికి గతేడాదిగా కొద్దిపాటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి. అతనికి విరేచనాలు కలిగిన ప్రతిసారి నెట్‌లో సమాధానం వెతకడం ప్రారంభించి తనకు దొరికిన అత్యంత సులభమైన చికిత్సను తీసుకుంటాడు. అంతటితో ఊరుకోకుండా తనకున్న లక్షణాలను తలుచుకుంటూ ఇంకా ఏయే రోగాలు ఉన్నాయో అని భ్రమపడుతూ చివరికి నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నాడు. 4-5 సెషన్లు అనంతరం తనకు ఎలాంటి రోగం లేదని ఆ ప్రబుద్ధుడు తెలుసుకున్నాడు’ అని ఓ డాక్టర్ తెలిపారు.
ఇలా లక్షణాల ఆధారంగా నెట్‌లో గంటలు గంటలు గడపడాన్ని సైబర్‌కాండ్రియా వ్యాధి అంటారని వైద్యులు చెబుతున్నారు. గూగుల్‌లో అన్నింటికీ సమాధానాలు దొరకవని ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అంతకన్నా దొరకవని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల డాక్టర్-రోగి మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటాయంటున్నారు.
Post a Comment