ఆర్మీ దుస్తులే ప్రాణంగా బతికాడు..
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన ఏడుగురు సైనికుల్లో నిరంజన్ ఒకరు. కేరళకు చెందిన ఆయన.. చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు. ఆ తర్వాత బెంగళూరులో విద్యాభ్యాసం చేసి ఆర్మీలో చేరారు. జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్ జీ)లో విధులు నిర్వహిస్తున్న కల్నల్ నిరంజన్.. విధినిర్వహణలో భాగంగా శనివారం తెల్లవారుజామునుంచి ఉగ్రమూకలతో పోరాడుతూ ఆదివారం అనూహ్యరీతిలో మరణించారు.
ఉగ్రవాదులు అమర్చిన గ్రేనేడ్ ను నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలడంతో నిరంజన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. నిరంజన్ మరణంతో బెంగళూరులోని ఆయన నివాసంతోపాటు కేరళలోని స్వగ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. 'నిరంజన్ చనిపోవడం ఓ వైపు బాధ కలిగిస్తున్నప్పటికీ, దేశం కోసం ప్రాణాలర్పించి మేం గర్వపడేలా చేశాడు' అని ఆయన సోదరి మీడియాతో అన్నారు.
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు సైనికులు చనిపోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. ఆరుగురు ఉగ్రవాదుల బలగాలు మట్టుపెట్టగలిగాయి. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది.
Post a Comment