-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 07, 2016

సౌదీ ధోరణి సరికాదు

సౌదీ ధోరణి సరికాదు
సౌదీ అరేబియా ప్రమాదకర పోకడలకు పోతోంది. తన సంక్షోభాన్ని పశ్చిమాసియాపై రుద్ది, తన సమస్యను ప్రపంచ సమస్యగా మార్చాలని విశ్వప్రయత్నం చేస్తోంది. నూతన సంవత్సరం ప్రారంభమైన మర్నాడే దేశంలో షియా మతగురువు అల్-నిమ్‌త్రోసహా 47మందిపై అది అమలు చేసిన మరణశిక్షలు అనేక దేశాల్లో నిరసనలకూ, ఉద్రిక్తతలకూ దారితీశాయి. ఇరాన్ రాజధాని టెహరాన్‌లో ఉన్న సౌదీ రాయబార కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించడంతోపాటు మరో నగరంలోని సౌదీ కాన్సులర్ భవనంపై బాంబులు విసిరారు. ఈ నిరసనలను సాకుగా తీసుకుని ఇరాన్‌తో సౌదీ అరేబియా తన దౌత్యసంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించడమే కాక, తమ దేశంలోని ఇరాన్ దౌత్య సిబ్బంది 48 గంటల్లో దేశం విడిచిపోవాలని ఆదేశించింది. ఆ దేశంతో వైమానిక సర్వీసులనూ, వాణిజ్యాన్ని కూడా రద్దు చేసుకుంది.

బహ్రెయిన్, సూడాన్‌లు సైతం సౌదీ మార్గాన్నే అనుసరించగా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్‌తో తనకున్న దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించుకుంటున్నట్టు ప్రకటించింది. కువైట్ కూడా ఇరాన్‌లోని తన రాయబారిని వెనక్కి పిలిపించింది. గత కొన్నేళ్లుగా ప్రపంచంలో 140కిపైగా దేశాలు ఉరిశిక్షల్ని రద్దు చేయడమో, వాటిని అమలు చేయకపోవడమో కొనసాగిస్తున్నాయి. పశ్చిమాసియాలోని రెండు ముఖ్య దేశాలు సౌదీ అరేబియా, ఇరాన్ మాత్రమే అధిక సంఖ్యలో మరణశిక్షల్ని అమలుచేస్తున్నాయి.  2014లో సౌదీ 90మందిని ఉరితీయగా నిరుడు ఆ సంఖ్య 157కు చేరుకుంది. అటు ఇరాన్‌కూడా తక్కువేమీ తినలేదు. అది 694మందిని ఉరికంబానికి ఎక్కించింది. ఇప్పుడు సౌదీ మరణదండన అమలు చేసినవారిలో షియా మత గురువు ఉండటం పలు దేశాల్లో ఉన్న ఆ తెగవారిలో ఆగ్రహాన్ని కలిగించింది. సహజంగానే ఇరాన్‌లో షియాలు ఎక్కువగా ఉంటారు గనుక ఆ ఆగ్రహం అవధులు దాటింది. ఇందుకు ఇరాన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది కూడా. అయినా సౌదీ శాంతించలేదు.
మరణశిక్షలు అమలు చేసినరోజే యెమెన్‌లో కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ  ఆ దేశంలో సౌదీ అరేబియా వైమానిక దాడులకు పాల్పడటం యాదృచ్ఛికమేమీ కాదు. యెమెన్‌లో  అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హౌతీ మిలి టెంట్లు షియా తెగవారే. షియా మత గురువును ఉరితీయడంద్వారా, యెమెన్‌లో దాడుల్ని పునఃప్రారంభించడం ద్వారా ఇరాన్‌లోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న షియాలను రెచ్చగొట్టడం...ఆ సాకుతో ఇరాన్‌తో ఉన్న సంబంధాలను తెంచు కోవడం సౌదీ ధ్యేయం. నిజానికి షియా మత గురువును ఉరితీయడం అన్యాయం, అమానవీయం.  2011లో అరబ్ దేశాల్లో ‘జాస్మిన్ విప్లవం’ ఉవ్వెత్తున ఎగసిన ప్పుడు తమ తెగ ఎదుర్కొంటున్న అణచివేతకు నిరసనగా జరిగిన శాంతియుత ఉద్యమానికి ఆయన నేతృత్వంవహించాడు. సౌదీలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉన్న తమ తెగకు కనీస హక్కులు లేకపోవడాన్ని నిలదీశాడు. సౌదీ రాజరికానికి అది మరణశిక్ష విధించాల్సిన తీవ్రమైన నేరమైంది! ఆయనతోపాటు ఇప్పుడు మరణశిక్ష అమలైనవారిలో సున్నీలు కూడా ఉన్నారుగానీ వారంతా అల్-కాయిదా నాయకుడు బిన్ లాడెన్ పిలుపు మేరకు 2003- 2006 మధ్య సౌదీలో వివిధ ఉగ్రవాద సంఘటనల్లో పాల్గొన్నవారు.

సౌదీ అరేబియా ఇటీవలికాలంలో అనుసరిస్తున్న ధోరణుల వెనక వేరే కారణాలున్నాయి. షియా తెగకు చెందిన సిరియా అధినేత బషర్ అల్ అసద్‌ను పదవీభ్రష్టుణ్ణి చేయడానికి అమెరికాను ముందుపెట్టి ప్రారంభించిన యుద్ధం ఇప్పటికి అయిదేళ్లు దాటుతున్నా దారీతెన్నూ లేకుండా పోయింది. ఆ యుద్ధంవల్ల పుట్టుకొచ్చిన ఐఎస్ ఉగ్రవాద సంస్థను నియంత్రించడమెలాగో తెలియక అయోమ యంలో పడిన అమెరికా...చివరకు అసద్‌తోనే చెలిమికి సంసిద్ధం కావడం, ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సౌదీకి రుచించలేదు. దానికితోడు అసద్‌కు బాసటగా రష్యా రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి మొత్తం మారి పోయింది.  యెమెన్‌లో తాను ఈజిప్టు, బహ్రెయిన్, కువైట్, సూడాన్ తదితర దేశాలను తోడు తెచ్చుకుని, అమెరికా మద్దతుతో మొదలెట్టిన యుద్ధం సైతం అనుకున్న ఫలితాన్ని సాధించకుండానే కాల్పుల విరమణకు దారితీయడం సౌదీ అరేబియాకు పుండుమీద కారం జల్లినట్టయింది.

అమెరికా-ఇరాన్ సంధి సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. అమెరికా ఆంక్షల పర్యవసానంగా పలు సంవత్సరాలనుంచి ప్రపంచ మార్కెట్‌లో ఇరాన్ చమురు లేకుండా పోయింది. కనుక ఆ రంగంలో తనదే ఆధిపత్యం. ఇప్పుడది పూర్తిగా తారుమారయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.  నిరుడు సౌదీ బడ్జెట్ 9,800 కోట్ల డాలర్ల లోటుతో సాగింది. అది ఈ ఏడాది మరింత పెరగవచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. విదేశీ మారక నిల్వలు ఒక్క ఏడాదిలోనే దాదాపు 90 కోట్ల డాలర్ల మేర పడిపోయాయి. పర్యవసానంగా దేశంలో గ్యాస్ ధరలను 50 శాతం పెంచడంతోపాటు సబ్సిడీలపై కోతలు విధిం చింది. ఈ పరిణామాలన్నీ దేశ ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి.

ఇరాన్‌ను మళ్లీ ఏకాకిని చేస్తే తప్ప, అమెరికా-ఇరాన్‌లమధ్య కుదిరిన అవగాహనను దెబ్బ తీస్తే తప్ప దీనంతటినుంచీ బయటపడటం సాధ్యం కాదని భావించబట్టే సౌదీ అరేబియా విపరీత పోకడలకు పోతోంది.  ఐఎస్ ఉగ్రవాదంపై అన్ని దేశాలూ సమష్టిగా పోరాడవలసిన తరుణంలో సౌదీ అరేబియా ఆ వాతావరణాన్ని ఛిద్రం చేస్తున్నది. ఇలాంటి ధోరణులు అరబ్ దేశాల్లో సామరస్యంగా, ప్రశాంతంగా జీవిస్తున్న షియా, సున్నీ తెగలమధ్య వైరాన్ని పెంచుతాయి. పశ్చిమాసియాను రణక్షేత్రంగా మారుస్తాయి. ఈ పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థను సైతం దెబ్బతీస్తాయి. ఇన్నాళ్లుగా సౌదీ ఏం చేసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అమెరికా ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి. సౌదీని కట్టడి చేయాలి.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu