నటి వరలక్ష్మికి మాట ఇచ్చాను అంటున్నారు నటుడు విశాల్. ఏమిటీ అప్పుడే ఏదేదో ఊహించేసుకుంటున్నారా, ఇప్పటికే వీరిద్దరిపై ప్రేమ,దోమ అంటూ వదంతులు ప్రచారంలో ఉన్నాయి. మీ ఊహలకూ అర్థం ఉంది. అయితే ఇక్కడ విశాల్ నటి వరలక్ష్మికి ఏమి మాట ఇచ్చారు, ఆ కథేంటో చూద్దాం. వరలక్ష్మి నటుడు శరత్‌కుమార్ కూతురన్న విషయం తెలిసిందే.
ఆమె విశాల్‌తో కలిసి మదగజరాజా చిత్రంలో నటించారు. నిర్మాణం పూర్తి చేసుకున్నా ఆర్థిక సమస్యల కారణంగా ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు.అయితే ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే విశాల్‌కు వరలక్ష్మికి మధ్య సన్నిహితం ఏర్పడిందంటారు. విశాల్ తాజాగా కథకళి అనే చిత్రాన్ని నిర్మించి హీరోగా నటించారు. ఈ చిత్రం గురువారం తెరపైకి రానుంది. మరో విషయం ఏమిటంటే వరలక్ష్మి నటించిన తారైతప్పట్టై చిత్రం అదే రోజు విడుదల కానుంది. ఇందులో శశికుమార్ హీరో.
విషయం ఏమిటంటే విశాల్‌కు తన చిత్రాన్ని విడుదల రోజున థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకుల మధ్య చూడడం ఆనవాయితి. అయితే ఈ సారి ముందు నటి వరలక్ష్మి నటించిన తారైతప్పట్టై చిత్రాన్ని ముందు చూసి ఆ తరువాత తన కథకళి చిత్రాన్ని చూడనున్నట్లు విశాల్ ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని విశాల్ వద్ద ప్రస్థావించగా తాను వరలక్ష్మి నటించిన చిత్రాన్ని ముందు చూస్తానని ఆమెకు మాట ఇచ్చానని అందుకే తన చిత్రం కంటే ముందు తారైతప్పట్టై చిత్రం చూడనున్నట్టు వివరించినట్లు కోలీవుడ్ వర్గాల టాక్.
Post a Comment