మ్యాన్హోల్ తెరిచి పెట్టారు…కోటిన్నర ఇవ్వండి!
ముంబై: మ్యాన్హోల్ను పాక్షికంగా తెరిచిఉంచినందుకు 51 ఏళ్ల వ్యక్తి గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీఎం)పై దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు. మ్యాన్హోల్ తెరిచి ఉంచడం వల్ల తాను అందులో పడి.. కాలు విరిగిందని, ఇందుకు పరిహారంగా రూ. కోటిన్నర చెల్లించాలని ఆయన లీగల్ నోటీసులు జారీచేశారు.51 ఏళ్ల విజయ్ హింగొరానీ వ్యాపారవేత్త. వ్యాపారాభివృద్ధి వ్యూహాలు రూపొదించి ఇవ్వడం ఆయన పని. గత ఏడాది నవంబర్ 29న బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఒట్టెర్స్ క్లబ్ సమీపంలో పాక్షికంగా తెరిచి ఉంచిన మ్యాన్హోల్లో ఆయన ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో ఆయన కాలు విరిగింది. ఈ హఠాత్ పరిణామంతో బెంగళూరులోని ఓ ప్రముఖ సంస్థలో పనిచేసే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. మంచి వేతనం, బోనస్, వసతితో ఉద్యోగం కల్పిస్తామని, ఈ ఏడాది జనవరి 1 నుంచి చేరమని ఆ సంస్థ ఆఫర్ ఇచ్చింది.
కాలు విరిగి మంచాన పడటంతో ఆయన ఈ సువర్ణ అవకాశాన్ని కోల్పోయారు. కాలు విరగడంతో హోలీ ఫామిటీ ఆస్పత్రిలో ఆయన నాలుగు వారాల చికిత్స పొందారు. ఇప్పుడు ఇంటివద్ద కోలుకుంటున్నారు. ముంబై మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా తన క్లయింట్ హింగోరానీ భౌతికంగా గాయపడి, జీవనోపాధిని కోల్పోయారని, కాబట్టి చికిత్స ఖర్చులు, జీవనోపాధికి సంబంధించి రూ. కోటిన్నర పరిహారం చెల్లించాలని ఆయన లాయర్ తెలిపారు. తన క్లయింట్కు ముంబై మున్సిపాలిటీ పరిహారం చెల్లించకుంటే.. దానిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Post a Comment