‘దుబాయ్’ మంటలకు కారణమేంటి?
దుబాయ్: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా దుబాయ్‌లోని అడ్రస్ డౌన్‌టౌన్ లగ్జరీ హోటల్‌లో చెలరేగిన మంటలపై ఆ దేశ ప్రభుత్వం విచారణ జరుపుతోంది. 63 అంతస్తుల ఈ భవనంలో గురువారం రాత్రి భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, 30 మందికి స్వల్ప గాయాలయినట్టు అధికారులు చెబుతున్నారు. ఒకరికి గుండె పోటు వచ్చింది. భవనం 20వ అంతస్తులో లేచిన ఈ మంటలకు గల కారణాలను కనుగొనేందుకు అధికారులు శుక్రవారం ప్రయత్నించారు. అయితే ఇప్పటికీ కచ్చితమైన కారణమేదీ గుర్తించలేకపోయారు. ఇన్వెస్టిగేటివ్ ఫొటోగ్రాఫర్ ఒకరు మంటలు అంటుకుంటున్నప్పుడు తీసిన ఫొటోను దుబాయ్ అత్యున్నత భద్రతా అధికారి జనరల్ దహీ ఖల్ఫాన్ ట్విటర్‌లో పోస్టు చేశారు.
విచారణ ఇక్కడి నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. భవనంలో మంటలు చెలరేగుతున్న సమయంలో అందులోని వారు భయంతో పరుగులు తీశారని, హఠాత్ పరిణామంతో కొందరు స్పృహతప్పి పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు రాత్రంతా శ్రమిస్తూనే ఉన్నారు. శుక్రవారం ఉదయం వరకు దట్టమైన నల్లని పొగలు ఎగజిమ్ముతూనే ఉన్నాయని ఏఎఫ్‌పీ ఫొటోగ్రాఫర్ వెల్లడించారు. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన బుర్జ్ ఖలీఫా భవనం సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో అంతా ఉలిక్కిపడ్డారు
Post a Comment