2 పరుగులు.. 2 వికెట్లు
* హైదరాబాద్, ఆంధ్ర పరాజయం
* పాండే, చావ్లా హ్యాట్రిక్...
* ముస్తాక్ అలీ టి20 టోర్నీ
కొచ్చి: జాతీయ జట్టులోకి తిరిగి ఎంపికైన తర్వాత ఆడిన తొలి టి20 మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌లో నిరాశపర్చాడు. ముస్తాక్ అలీ దేశవాళీ జాతీయ టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా శనివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ 5 బంతుల్లో 2 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీసినా అప్పటికే పంజాబ్ జట్టు పరాజయం ఖరారైపోయింది.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. మన్‌దీప్ సింగ్ (52 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో పంజాబ్ 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ 6 వికెట్లకు 133 పరుగులు చేసింది. రాజేశ్ బిష్ణోయ్ (32 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) గెలిపించాడు.
వడోదర: ఈశ్వర్ పాండే (4/20) హ్యాట్రిక్ సహాయంతో మధ్యప్రదేశ్ 5 వికెట్లతో ఆంధ్రపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్. శ్రీనివాస్ (22)దే అత్యధిక స్కోరు. మ్యాచ్ నాలుగో ఓవర్లో పాండే వరుస బంతుల్లో భరత్, ప్రశాంత్, ప్రదీప్‌లను అవుట్ చేయడం విశేషం. అనంతరం ఎంపీ 5 వికెట్లకు 96 పరుగులు చేసింది.
కటక్: ఉత్తరప్రదేశ్ 7 వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. కేదార్ జాదవ్ (29 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో మహారాష్ట్ర 7 వికెట్లకు 109 పరుగులు చేసింది. యూపీ బౌలర్ పీయూష్ చావ్లా (4/28) హ్యాట్రిక్ సాధించడం విశేషం. అనంతరం యూపీ 3 వికెట్లకు 113 పరుగులు చేసింది.
షమీకి 3 వికెట్లు...
నాగపూర్: వృద్ధిమాన్ సాహా (47 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), సాయన్ మోండల్ (41 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో బెంగాల్ 61 పరుగులతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా బెంగాల్ 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ 16.2 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. అక్షత్ రెడ్డి (32) మినహా అంతా విఫలమయ్యారు. మొహమ్మద్ షమీ (3/18) రాణించాడు.
వడోదర: దీపక్ హుడా (48 నాటౌట్), కేదార్ దేవధర్ (48) రాణించడంతో బరోడా 49 పరుగులతో అస్సాంను ఓడించింది. బరోడా 8 వికెట్లకు 165 పరుగులు చేయగా...అస్సాం 116 పరుగులకే కుప్పకూలింది. ఇర్ఫాన్ పఠాన్ 13 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం.
ఇక్కడే జరిగిన మరో మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్లతో రైల్వేస్‌ను ఓడించింది. ముందుగా రైల్వేస్ 2 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు చేసింది. సౌరభ్ వకాస్కర్ (55 బంతుల్లో 118; 7 ఫోర్లు, 11 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్‌తో సెంచరీ సాధించాడు. అనంతరం ఢిల్లీ ఈ భారీ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఆదిత్య కౌశిక్ (53), ఉన్ముక్త్ (38), నేగి (35 నాటౌట్), రాణా (34) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
Post a Comment