అంతుబట్టని లాజిక్!
రెవెన్యూ మంత్రి వరకూ ఫిర్యాదులు
బాధితులకు లభించని ఊరట
అనకాపల్లి: వల్లూరు లాజిస్టిక్ పార్కు కోసం సేకరించిన భూములకు ఏ ప్రాతిపదికన నష్టపరిహారం చెల్లించారో అంతుబట్టని వ్యవహారంగా మారింది. లబ్ధిదారుల ఖాతాల్లోకి పరిహారం సొమ్ము వేసే ప్రక్రియ పూర్తయినప్పటికీ ఆర్థిక వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ వివాదం ఇప్పుడు స్వయంగా రెవెన్యూ మంత్రి దృష్టికి కూడా వెళ్లింది. సుమారు 374 మంది లబ్ధిదారులను మూడు కేటగిరీల్లో గుర్తించి 286 ఎకరాల భూమిని రెవెన్యూ యంత్రాంగం సేకరించింది. ఈ భూమి ఏపీఐఐసీ ద్వారా పోర్టుట్రస్టుకు దఖలుపరిచే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
అంతు చిక్కని పీటముడి : ప్రస్తుతం వల్లూరు లాజిస్టిక్ పార్కు భూసేరణ అనంతరం నష్టపరిహారం తంతు ముగిసినా ఇంకా వేధిస్తున్న ఒక చిక్కుముడి ఇప్పుడు అధికారుల్ని, రైతుల్ని, దళారుల్ని వెన్నాడుతోంది. చినికిచినికి గాలి వానలా మారిన ఈ ఆర్థిక వివాదం ఒక ఎమ్మెల్యే, కీలకమైన అధికారులు, రెవెన్యూ మంత్రి దృష్టికి కూడా వెళ్లింది. ఏమిటా చిక్కుముడి?: వల్లూరు లాజిస్టిక్ పార్కు భూసేకరణకు ముందు స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి ఇద్దరు రైతుల నుంచి సుమారు మూడెకరాల డీపట్టా భూమిని 99 సంవత్సరాలకు లీజుకు తీసున్నాడు. అప్పటికే ఆ భూమిని అసలు రైతు దగ్గర నుంచి మరో మహిళ కొనుగోలు చేశారు. అప్పట్లో వల్లూరు డీ పట్టా భూములకు పెద్దగా విలువ లేకపోవడంతో భూముల క్రయవిక్రయాలను ఎవరూ పెద్దగా పట్టించుకొనే వారు కాదు. ఇప్పుడు ఎకరాకు 14 లక్షల 75 వేల రూపాయిల నష్టపరిహారం రావడంతో ఆర్థిక వివాదాలు పెరిగిపోయాయి. నష్టపరిహారం అసలు రైతుల ఖాతాలో పడిపోవడంతో అధికార పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. బ్యాంకు నుంచే సదరు నష్టపరిహారాన్ని తన ఖాతాలోకి మళ్లించుకొని భూమిని కొనుగోలు చేసిన వారికి అం దించి ఒరిజినల్ డాక్యుమెంట్లు తెస్తానని నమ్మబలికాడు. తీరా భూమిని లీజుకి తీసుకున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగికి నష్టపరిహారం అందకపోవడంతో వివాదం మొదలయింది. లీజుకి తీసుకున్న భూమి లాజిస్టిక్ పార్కులో పోవడం, పైసా నష్టపరిహారం అందకపోవడంతో ఆ ఉద్యోగి ఈ వివాదాన్ని విశాఖ సిటీకి చెందిన ఒక ఎమ్మెల్యేకు, రెవెన్యూ ఉన్నతాధికారులకు, చివరకు రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆర్డీవో లేఖ రాసినా..? ఈ వివాదం రెవెన్యూ మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆర్డీవో రంగంలోకి దిగి స్థానిక తహశీల్దార్‌కు సమస్య పరిష్కరించాలని లేఖ రాశారు. అయినప్పటికీ బాధితులకు ఊరట లభించలేదు.
ఎందుకో ఉలికిపాటు : అనకాపల్లి మండలంలోని వల్లూరు భూసేకరణ నష్టపరిహార వివాదం ఒక రెవెన్యూ అధికారికి ఉలికిపాటు కలిగిస్తోంది. ఆర్థిక లావాదేవీలపై కాల్‌మనీ కేసు పెడతామని, ప్రొబెషనర్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్(పీవోటీ) యాక్ట్ ప్రయోగించి కేసు పెడతామని భూములు దక్కించుకున్న స్టీల్ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. చట్టం, నిబంధనల వరకూ బాగానే ఉన్నా ఈ ఉదంతంలో వల్లూరు భూసేకరణ తీరునే ప్రశ్నించే అనేక అనుమానాలు ఇప్పుడు అందరి మదిలో తలెత్తుతున్నాయి.
వీటికి సమాధానం ఎవరు చెబుతారు?
ఒరిజినల్ పట్టాలు లేకుండానే నష్టపరిహారం ఎలా మంజూరయింది? భూములు సర్వే చేసిన సర్వేయర్ అక్కడ ఒరిజినల్ పట్టాలు లేకుండానే ఎలా గుర్తించారు? ఒక వేళ డీపట్టా ఒరిజినల్ లేకపోయినా డూప్లికేట్ తయారు చేసి ఉంటే ఇలా అన్నింటికి ఇదే తరహా తతంగాన్ని నడిపారా? బ్యాంకులోని రైతు ఖాతా నుంచి లక్షల్లో పరిహారం మధ్యవర్తికి ఎలా బదిలీ అయింది? రెవెన్యూ మంత్రి నుంచే సిఫారసు వచ్చిందంటే ఈ వివాదంలో విశ్వసనీయత లేనట్లా..? ఎవరికి కాపాడేందుకు.. ఏ రహస్యాన్ని దాచేం దుకు ఈ తతంగం?
Post a Comment