-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 01, 2016

ఆరు నెలలకే ఫ్రెండ్స్ అయ్యారు ఎలా ?


ఆరు నెలలకే  ఫ్రెండ్స్  అయ్యారు ఎలా ?
రహస్యం 2015
అంతు చూస్తామని .. ఆరు నేలలకే  ఫ్రెండ్స్  అయ్యారు ఎలా ?
ఈ ఏటి మేటి మిస్టరీగా తెలంగాణ, ఏపీ సీఎంల వ్యవహార శైలి


హైదరాబాద్:
 ‘నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు.. నగ్నంగా, పచ్చిగా పట్టపగలే దొరికిన దొంగవు నువ్వు.. ఇంకా ఎక్కువ మాట్లాడితే తగిన శాస్తి జరుగుతుంది..’

 ‘నేను కళ్లు తెరిస్తే కష్టాలే.. నన్ను అరెస్టు చేస్తే నీ ప్రభుత్వానికి అదే ఆఖరి రోజు. నా ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం నీకెవరిచ్చారు? ట్యాపింగ్ కేసులో నువ్వు జైలుకు వెళ్లకతప్పదు..' ...ఈ తిట్లు, భీకర హెచ్చరికలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు! ఎవరు, ఏ సందర్భంలో అన్నారో రెండు రాష్ట్రాల ప్రజలందరికీ సుపరిచితమే!! కేసుల మీద కేసులు.. టేపుల మీద టేపులు.. నువ్వు తమలపాకుతో ఒకటంటే నేను తలుపు చెక్కతో రెండంటా అన్నట్టుగా ఉండేది ఇరువురి నేతల వ్యవహారం.
 
ఏదేమైనా ఆ ఇద్దరూ చెప్పిందొకటే.. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుందని..(?)’ కానీ ఏమైంది? ‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్టు ‘తగిన శాస్తి’ జరిగిందా? చంద్రబాబు హెచ్చరించినట్టు ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకు వెళ్లారా? ఏదీ జరగలేదు. 2015 మొదటి అర్థభాగం వరకు రెండు రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనేలా చేసిన ఇరు రాష్ట్రాల చంద్రుల మధ్య అదే ఏడాది చివరికి వచ్చేసరికి ‘సఖ్యత’ చోటుచేసుకుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కనపెట్టారు. నోటికి వచ్చినట్లు తిట్టుకున్న కొద్ది కాలానికే మాటలు కలిశాయి. మర్యాదలు పెరిగాయి. కేసుల అలజడి అసలే లేదు. పెపైచ్చు తమ తమ రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ ఇరువురు ఒకరి నివాసానికి మరొకరు వెళ్లి ఆహ్వానాలు ఇచ్చుకున్నారు. అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం వెళ్తే.. కేసీఆర్ తలపెట్టిన అయుత చండీయాగానికి ఏపీ సీఎం హాజరయ్యారు.

గడచిన ఏడాదిలో సగ భాగం కంటే ఎక్కువ కాలం ఉప్పు-నిప్పుగా ఉన్న బాబు-కేసీఆర్ ఇప్పుడు పాలు-నీళ్లలా కలిసిపోయారు. కలిస్తే చాలు పరస్పరం అభివాదాలు, నవ్వులు, సరదా ముచ్చట్లు. ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణలో ఓటుకు కోట్లు కేసు, ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమైపోయాయన్నదే సామాన్యుల మదిని తొలుస్తున్న ప్రశ్న! తన పని తాను చేసుకుపోవాల్సిన చట్టం ఎవరికి చుట్టంగా మారింది? ఏలికలు ఒక్కటవగానే కేసులెందుకు మూలన పడ్డాయి?! అందరినీ సమానంగా చూడాల్సిన చట్టం కొందరిని ఎందుకు ఎక్కువ సమానంగా చూస్తోంది? పదేళ్లు హైదరాబాద్ మాదే అని హూంకరించిన చంద్రబాబు 2016 జూన్ నాటికి హైదరాబాద్‌లో ఏపీ సచివాలయానికి తాళాలు వేయాలని ఎందుకంటున్నారు? ఇవ న్నీ గతేడాది మిగిల్చిన శేష ప్రశ్నలు! మొత్తంగా 2015.. జనం చెవిలో పాలకులు పెట్టిన పూలకు తార్కాణంగా నిలిచిపోయింది!!
 ‘ట్యాపింగ్’ గోల ఇదీ..
 తెలంగాణలో ఓటుకు కోట్లు కేసుకు ప్రతిగా ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు ఐపీఎస్, ఐఎఎస్ అధికారులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. తెలంగాణలో తన ను అప్రతిష్టపాలు చేశారని గమనించిన చంద్రబాబు ఏపీలో కొత్త డ్రామాకు తెరతీశారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపిన కేసును రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అది కాస్త బెడిసికొట్టడంతో లాభం లేదనుకుని ట్యాపింగ్ కేసు పెట్టి కేసీఆర్‌పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కారు ఇరుక్కుంటుందని అంతా భావించారు. కాల్ డేటా సమర్పించాలని విజయవాడలో పోలీ స్ కమిషనర్ సెల్‌ఫోన్ కంపెనీలను ఆదేశిం చారు. పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వాల్సిందేనని విజయవాడ కోర్టు తేల్చిచెప్పింది. సీఎం కేసీఆర్ సహా ముగ్గురు ఐపీఎస్, ఒక ఐఎఎస్ అధికారి జైలుకేనంటూ ఏపీ మంత్రులు మండిపడ్డారు. కొన్నాళ్లు పోతే గానీ అసలు విషయం బోధపడలేదు. కేసుల సంగతి దేవుడెరుగు చంద్రబాబు హైదరాబాద్ రావడమే మానేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగితేనో లేదా ముఖ్యమైన కార్యక్రమం ఉంటే తప్ప హైదరాబాద్ రావడం లేదు. పదేళ్ల పాటు రాజధాని అంటూ గొప్పలకు పోయిన సీఎం చంద్రబాబు ఇప్పుడు.. అబ్బే హైదరాబాద్ నుంచి ఉద్యోగులంతా అమరావతి రావాల్సిందేనని హుకుం జారీ చేశారు.

 ‘ఓటుకు కోట్లు’లో హడావుడి ఇలా..
 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ద్వారా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇచ్చారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని రేవంత్‌రెడ్డిని అరెస్టు చేశారు. అంతే కాదు కేసును చాలా స్పీడ్‌గా నడిపించారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన చంద్రబాబు ఫోన్ సంభాషణల టేపులు బయట పెట్టారు. ఇంకేముంది చంద్రబాబుకు కష్టకాలమే అనుకున్నారు. దానికి తగ్గట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే స్థాయిలో చంద్రబాబుపై చెలరేగిపోయారు. ఓటుకు కోట్లు కేసులో బాబుకు ఇబ్బందులు తప్పవని అందరూ అనుకున్నారు. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి ఏసీబీ విచారిస్తుందని భావించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ సంభాషణ టేపులు బయటపడ్డ వెంటనే ఈ కేసు కీలక దశకు చేరుకుందని ఏసీబీ అధికారులు హడావుడి చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని గంభీరమైన ప్రకటనలు చేశారు.

 నేను కళ్లు తెరిస్తే...: చంద్రబాబు
‘‘నేను కళ్లు తెరిస్తే కష్టాలే. నన్ను అరెస్టు చేస్తే నీ ప్రభుత్వ పతనం తప్పదు. నీకు ఎన్ని అధికారాలు ఉన్నాయో నాకూ అన్ని అధికారాలు ఉన్నాయి. రాష్ట్రాల మధ్య తగవులు వద్దు. నువ్వు కాదని మొండికేస్తే విషయం చాలా దూరం వెడుతుంది. సమయం వచ్చినప్పుడు ఒక్కో అస్త్రం వదులుతా. స్టింగ్ ఆపరేషన్ పేరుతో ప్రభుత్వానికి చెందిన వారు ఫోన్లు ట్యాప్ చేస్తావా..? ఇది నీచాతి నీచం. మాకూ ఏసీబీ ఉంది. మీ ఏసీబీ హైదరాబాద్‌లో ఉంటే మా ఏసీబీ కూడా హైదరాబాద్‌లోనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నువ్వు జైలుకు వెళ్లక తప్పదు.
 ఠి జూన్ 9న గుంటూరులో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌పై చంద్రబాబు విసుర్లు

 బాబును బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు: కేసీఆర్
 ‘‘చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే తగిన శాస్తి జరుగుతుంది. నగ్నంగా, పచ్చిగా పట్టపగలే దొరికిన దొంగవు నీవు. అరచి పెడబొబ్బలు పెట్టి ఏదో చేయాలనుకుంటున్నావు. కేసులో ఇరికిస్తే ఇరికే మనిషివా నువ్వు చంద్రబాబూ..? హైదరాబాద్ నీ అబ్బ జాగీరా, నీ తాతదా... కేసీఆర్ నీ లెక్క దొంగ కాదు, లత్కోరు పని చేయడు...’’
 జూన్ 9న నల్లగొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ వ్యాఖ్యలివీ!
 

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu