-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 13, 2016

రంగంలోకి దిగిన నగ్మా..?


♦  అంతా ఒక్కటే గ్రూపులకు నోచాన్స్
♦  రాహుల్ ఆదేశాలకు కట్టుబడాల్సిందే
♦  మహిళా నేతలకు నగ్మా హెచ్చరిక
♦  వివాదాలు చక్కదిద్దేందుకు రంగంలోకి

 సాక్షి, చెన్నై: మహిళా కాంగ్రెస్‌లో గ్రూపులకు ఆస్కారం లేదు...అంతా ఒక్కటే...రాహుల్ ఆదేశాలకు కట్టుబడాల్సిందే.. అని మహిళా నేతలకు ఆ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ నగ్మా హెచ్చరికలు జారీ చేశారు. మహిళా కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదాల్ని చక్కదిద్దేందుకు ఆమె రంగంలోకి దిగారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోవలే, మహిళా విభాగంలోనూ గ్రూపు రాజకీయాలు బయలు దేరిన విషయం తెలిసిందే. విజయధరణి అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం ఈ రాజకీయం మరింతగా వేడెక్కాయి.  ఇక, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయధరణి ఏకంగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ను ఢీకొట్టడంతో వివాదం మరింతగా ముదిరింది. ఈ వ్యవహారాలు ఢిల్లీకి చేరి ఉండడంతో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు మహిళా విభాగం రాష్ర్ట ఇన్‌చార్జ్ , జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా రంగంలోకి దిగారు.


మహిళా నాయకుల్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి, తామంతా ఒక్కటే అని చాటేందుకు తీవ్ర కుస్తీల్లో పడ్డారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చిన నగ్మా మహిళా నేతలతో సమాలోచనలో పడ్డారు. మహిళా విభాగంలో సాగుతున్న గ్రూపుల్ని కట్టడి చేయడంతో పాటుగా, టీఎన్‌సీసీ వర్గాలతో ఏర్పడిన వివాదాన్ని చక్కబెట్టేందుకు కసరత్తుల్లో పడ్డారు.

 ఇక,  మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో పేదలకు సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమానికి హాజరైన నగ్మా విలేకరులతో మాట్లాడుతూ, గ్రూపులకు ఆస్కారం లేదని, అంతా ఒక్కటే...ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ ఆదేశాలకు కట్టుబడాల్సిందేనని మహిళా నేతలకు  హెచ్చరికలు జారీ చేశారు.

 అంతా ఒక్కటే : మహిళా కాంగ్రెస్‌లో గ్రూపులకు చోటు లేదని, అందరూ ఒకే వేదికగా పని చేయాల్సిందేని హెచ్చరించారు. రాహుల్ ఆదేశాలతో విజయధరణి నియమితులయ్యారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని హితవు పలికారు.

 ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా, మహిళా విభాగంలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేసినా రాహుల్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చిన్న చిన్న సమస్యలు, వివాదాలు సహజం అని, అయితే, దానిని మరింత పెద్దది చేసుకోకుండా, సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుని, అందరూ కలసి కట్టుగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌తో విజయధరణి వివాదం గురించి మీడియా ప్రశ్నించగా అందుకే తాను వచ్చానని, అన్ని సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు.

 టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ఆయనతో కలసి మహిళా నాయకులు ముందుకు సాగుతారని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వరద బాధితుల్ని ఆదుకోవడంలో అన్నాడీఎంకే సర్కారు పూర్తిగా విఫలం చెందిందంటూ మరో ప్రశ్నకు మండి పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతో వరదల బారిన ప్రజలు పడ్డారని, అయితే, వారిని ఆదుకోవడంలోనూ నిర్లక్ష్యం, ఏక పక్షం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నదని ధ్వజమెత్తారు.  రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయధరణి, జాతీయ కార్యదర్శి హసీనా సయ్యద్ పాల్గొన్నారు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu