2015 నాకు స్వర్ణయుగం
రావుగోపాలరావు, ప్రభాకర్‌రెడ్డి నాకు గురువులు
జూన్‌లో హీరోగా తొలిసినిమా
విలేకరులతో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి
అనకాపల్లి :
'లౌక్యం' సినిమాను థియేటర్‌లో చూస్తున్నప్పుడు ప్రేక్షకుల చప్పట్లు విని కన్నీళ్లు పెట్టుకున్నానని ప్రముఖ సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటుడు పృథ్వి పేర్కొన్నారు. పట్టణంలోని మంజీరా హోటల్‌లో ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ ఆయన తన సినీ ప్రస్థానం గురించి వివరించారు. 2015 తనకు స్వర్ణయుగంగా అభివర్ణించారు. బాలకృష్ణ వంటి సినీహీరోలతో ఫొటోలు తీసుకుందామనుకునే అభిలాష ఉన్న తనకు అలాంటి వ్యక్తులతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సినీ పరిశ్రమలో ఆనాటి తరం ప్రభాకరరెడ్డి, రావుగోపాలరావులే తనకు గురువులని పేర్కొన్నారు. వారు చెప్పినట్లు అనుకున్న గమ్యం చేరేందుకు క్రమశిక్షణ, సమయపాలన పాటించానని అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎ.ఎకనమిక్స్ చదివిన తాను యూనివర్సిటీలో సాంస్కృతిక కార్యక్రమాలకు సినీ నటులను తీసుకొచ్చేవాడినని, అలా ఒకసారి ప్రభాకరరెడ్డి తనను ఎన్టీ రామారావులా ఉన్నావంటూ చమత్కరించారని, సినిమా రంగంలోకి రమ్మని ఆయన ఇచ్చిన పిలుపు మేరకే చెన్నై, హైదరాబాద్‌లో ఎన్నో అవకాశాల కోసం శ్రమించానని అన్నారు.
జెలసీ లేదు..
ప్రస్తుతం హాస్యానికి ఆదరణ ఉందని, తమలో ప్రొఫెషనల్ జెలసీ లేదని, డైలాగ్ జెలసీ మాత్రమే ఉందని అన్నారు. 2014లో లౌక్యం తన కేరీర్‌కు అత్యంత మలుపు అని, అయితే 2003లో వచ్చిన ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ ఎంతో ఆదరణ పొందిందని అన్నారు. విలన్‌గా, కమేడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక పాత్రలు పోషించిన తనపై సినీ ప్రముఖులు అభిమానం చూపించేవారని అన్నారు. లౌక్యం, శంకరాభరణం సినిమాలకు రెండుసార్లు కళాసాగర్ అవార్డు పొందిన అదృష్టం తనకు దొరకడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2015లో తాను నటించిన ఐదు సినిమాలు విడుదల కావడం స్వర్ణయుగమని అన్నారు. నాగబాబు తనకు ఆప్తమిత్రుడు అని తెలిపారు. తదుపరి చిరంజీవి, పవన్‌కళ్యాణ్, వెంకటేష్, త్రివిక్రమ్‌లతో ఏర్పడిన పరిచయాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా బాబు బంగారంలో నటిస్తున్నానని, అల్లరి నరేష్ హీరోగా సెల్ఫీరాజా, ఆది హీరోగా చుట్టాల అబ్బాయి, అల్లు అర్జున్ హీరోగా సరైనోడు, పవన్‌కళ్యాణ్ హీరోగా సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోనూ, బాహుబలి -2లో నటిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వందసినిమాల మార్కుకు చేరుకోనున్నాని తెలిపారు. బుల్లితెర కూడా తనకెంతో గుర్తింపునిచ్చిందన్నారు.
హీరోగా తొలి సినిమా...
త్వరలో పృథ్వి హీరోగా '30 ఇయర్స్ ఇండస్ట్రీ - 40 దాటినా పెళ్లి కాలేదు' అనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వి స్వయంగా తెలిపారు. గుంటూరుకు చెందిన యువ దర్శకుడు కృష్ణారెడ్డి చక్కని సబ్జెక్టును తన వద్దకు తీసుకొచ్చారని, జూన్ నాటికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావ చ్చని ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో జబర్దస్త్ కళాకారులు రాపేటి అప్పారావు, అర్జున్, సత్తిపండు, లాఫింగ్‌క్లబ్ అధ్యక్షుడు బుద్ద సత్యనారాయణ, కార్యదర్శి అంగుళూరి త్రినాథరావు, ప్రొగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఎం.వి.జె. భువనేశ్వరరావు, బుద్ద శ్రీను, పొలమరశెట్టి చందు పాల్గొన్నారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment